మానవత్వం చాటుకున్న శ్రీశైలం పోలీసులు
1 min readఅభినందించిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ముగిసిన పది రోజులవుతున్నా భక్తుల తాకిడి తగ్గలేదు. కర్ణాటక భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థం కాలినడకన వస్తున్నారు. నల్లమల అడవి మార్గం గుండా దాదాపు 40 మంది కర్ణాటక భక్తులు పాదయాత్ర చేస్తుండగా… భీముని కొలను లోయ వద్ద వచ్చే సరికి దాహార్తి అలమటించారు. తాగేందుకు నీరు సరఫరా చేయాలని భక్తులు 100 కాల్ చేయగా… శ్రీశైలం ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బందితో వెళ్లి భక్తుల దాహార్తి తీర్చారు. అనంతరం వారిని క్షేమంగా శ్రీశైలం వెళ్లేవరకు సహాయపడ్డారు.
ఎస్పీ అభినందన..
శ్రీశైలంకు వెళ్లే కర్ణాటక భక్తులకు ఎస్ఐ హరిప్రసాద్ చేసిన సహాయం.. తెలుసుకున్న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప అభినందించారు. భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటూ… వారికి సేవ చేయాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందని ఎస్పీ ఫక్కీరప్ప ఈ సందర్భంగా గుర్తు చేశారు.