సామాన్యులకూ… వైకుంఠ దర్శనం…
1 min read– శ్రీ శివయోగీంద్ర సరస్వతి స్వామీజీ, శారదా జ్ఞాన పీఠం పీఠాధిపతి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: సామాన్యులకు సైతం శ్రీవారి అరుదైన వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడం ఎంతో ప్రశంసనీయమైన నిర్ణయమని కాకనూరు శ్రీ శారదా జ్ఞాన పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివయోగీంద్ర సరస్వతి మహరాజ్ అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, బుగ్గరామేశ్వరం వద్ద వారు జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. సామాన్య రోజులలోనే స్వామి వారి దర్శనం చాలా కష్టమైన తరుణంలో ఇటువంటి పుణ్యదినాలలో సామాన్యులకు దివ్యదర్శనం లభించడం పూర్వజన్మ సుకృతంగా వారు కొనియాడారు. లలిత పీఠాధిపతి శ్రీ గురు మేఘ సుబ్రమణ్య స్వామి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్ సబ్ డివిజన్ ప్రచారకులు బి.నాగరాజు, సర్పంచ్ విజయమ్మ,ఉప సర్పంచ్ శివ నాయక్,మహిళా కన్వీనర్ జె.రాజేశ్వరమ్మ, మండల కన్వీనర్ జి.కె.శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తిరుమలకు వెళ్ళే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పది కేంద్రాలనుండి పది బస్సులు ఏర్పాటు చేసి 500 మంది దళిత, గిరిజనులకు సామాన్యులకు ఈ అవకాశాన్ని కలిగించినట్లు వారు తెలిపారు.
500 మంది భక్తులకు ఉచిత దర్శనం…
కొలిమిగుండ్ల మండలం, పెట్నికోట గ్రామం మరియు నందిపాడు గ్రామం, బేతంచర్ల మండలం సీతారామాపురం గ్రామం, పాణ్యం మండలం భూపనపాడు గ్రామం, మహానంది మండలం పుట్టుపల్లి గ్రామం, ఆళ్ళగడ్డ మండలం,బత్తులూరు గ్రామం, కొత్తపల్లి మండలం శివపురం గూడెం మరియు భ్రమరాంబికా గూడెం, ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండా, పత్తికొండ మండలం దేవనకొండ గ్రామాలలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆర్ధిక సహకారంతో సమరసతా సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన ఆయా దేవస్ధానములనుండి పది బస్సులలో మొత్తం ఐదు వందల మంది భక్తులు తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. అందరికీ భోజన వ్యవస్థతోపాటు ఉత్తరద్వార దర్శనం తితిదేనే ఏర్పాట్లు చేసింది.