పిల్లలతో కలిసి.. భోజనం చేసిన జేసీ (ఆసరా)
1 min readగ్రామ సచివాలయాలు తనిఖీ చేసిన జేసీ(ఆసరా) శ్రీనివాసులు..
పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని చిన్న టేకుర్, పెద్ద టేకుర్, లక్ష్మీపురం , వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ సచివాలయలను జాయింట్ కలెక్టర్ యంకెవి శ్రీనివాసులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని పరిశీలించారు. అదేవిధంగా జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రుణం పొంది ఉన్నారు, ఎంత మందికి రుణ విముక్తి పత్రాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పట్టాలు ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి వంటి వివరాలను అడిగి తెలుసుకొని, ఈ పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
పెద్దటేకూరులో…: పెద్దటేకుర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నందు పిల్లలతో కలసి భోజనం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.