మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
1 min readసామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు
తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్, వసతి సమస్యలు లేకుండా గట్టి చర్యలు చేపట్టండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం లో వచ్చే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పక్కాగా ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యాంపు కార్యాలయం నుండి కర్నూలు, ప్రకాశం జిల్లా అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రం అచ్చంపేట,అమ్రాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల అధికారులతో ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కానీయకుండా ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే తెలంగాణ జిల్లాలు, ప్రకాశం జిల్లా అధికారులు,దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో పనించేయాలన్నారు..పాగాలంకరణ, శివరాత్రి పండుగ, రథోత్సవం నాడు మన రాష్ట్రంతో పాటుకర్ణాటక, మహారాష్ట్ర నుండి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్న ప్రసాదం, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసు భద్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, వసతి కల్పన, మెడికల్ క్యాంపులు, తగినన్ని ఆర్టీసీ బస్సుల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కూడా అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
కాలినడకన భక్తులకు… దర్శనం..
కాలినడకన సాధారణ భక్తులకు త్వరగా స్వామి వార్ల దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈఓ లవన్నను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి స్వామి, అమ్మవార్ల దర్శనం త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్యం విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదన్నారు.. ప్రతి 10 నుంచి 20 మీటర్ల లోపు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్త ను ఏరివేసే విధంగా ఏర్పాట్లు చేయాలని డిపిఓ మరియు దేవస్థానం ఈఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందికి గ్లౌజులు, మాస్క్ లు, శానిటైజర్ లు తగినన్ని అంద చేయాలన్నారు.. దేవస్థానం తో పాటు నాగలూటి, వెంకటాపురం, పెద్ద చెరువు దగ్గర కూడా తగినన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలన్నారు..30 పడకల ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ ఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనల కు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి స్పష్టమైన సూచనలు తీసుకోవాలని కలెక్టర్ ఈఓ ను ఆదేశించారు.
వాలంటీర్ల సేవలు వినియోగించుకోండి…
బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి సేవ చేసేందుకు వాలంటీర్లను గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థానం ఈఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాతాళ గంగ వద్ద గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ జేడీను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టెలికాం సంస్థ కమ్యూనికేషన్ కోసం మొబైల్ టవర్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా కండిషన్ లో ఉన్న బస్సు లను మాత్రమే పంపించాలని, గతంలో ఏర్పాటు చేసిన బస్సులకు అదనంగా ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ ఆర్ ఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మన జిల్లా తో పాటు ప్రకాశం, తెలంగాణ జిల్లాల రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్,అటవీ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ శాఖ కు సంబంధించి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నల్లమల్ల అటవీ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని, దోర్నాల నుంచి దేవస్థానం శిఖరం వరకు మొబైల్ క్రైన్ వాహనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని దేవస్థానం ఈఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆత్మకూరు నుండి దోర్నాలకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిందని ప్యాచ్ వర్కులను ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని ఆర్ అండ్ బి ఎస్ ఈ కి సూచించారు.
ఏర్పాట్లు చేస్తున్నాం…. ఈఓ లవన్న..
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న మాట్లాడుతూ…..మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం వచ్చే భక్తులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చేనెల 25వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, వచ్చేనెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవన్నారు. మార్చి 1వ తేదీ రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, లింగోద్భవం, కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలు సాంప్రదాయబద్దంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేవస్థానం పరిధిలోని వివిధ ప్రదేశాల్లో 28 వేల ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 8 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా వసతులు సమకూర్చామన్నారు. దేవస్థాన, జిల్లా పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో నిత్య పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు భక్తుల సౌకర్యార్థం 749 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలిక, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఈఓ వివరించారు. డీఎంహెచ్ఓ సహకారం తీసుకుని నడక దారిన వచ్చే శివభక్తులకు వెంకటాపురం, నాగలూటి, పెచ్చెరువు, కైలాసద్వారం, హటకేశ్వరం, శివదీక్ష శిబిరం, పాతాళ గంగ దారి తదితర 13 ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, శ్రీశైలం ఈఓ లవన్న, డిఆర్ఓ పుల్లయ్య, కర్నూలు, ప్రకాశం జిల్లా అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.