పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని..
1 min readవిజయవాడ: నిత్యం పోలీస్ యూనిఫామ్ లో ఉంటాడు. గన్ పెట్టుకుని తిరుగతాడు. దుర్గగుడిలో విధులు నిర్వహిస్తానని చెప్పాడు. పోలీసు శాఖలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. డబ్బులిస్తే జాబు వస్తుందని నమ్మబలికించాడు. చేతి నిండా డబ్బొచ్చేసరికి పరారీ అయ్యాడు. ఇదంతా అక్కల వీరారెడ్డి అనే ఓ మాయగాడి వీరగాథ. విజయవాడ సమీపంలోని నున్న గ్రామ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వాంబే కాలనీలో నివాసం ఉంటున్న హేమలత, వెంకటేశ్వరుల దంపతులు.. నూడిల్స్ బండితో పొట్టపోసుకుంటారు. వారి వద్దకి నూడిల్స్ తినేందుకు వీరారెడ్డి ప్రతిరోజు వచ్చే వాడు. తాను దుర్గగుడిలో పని చేస్తున్నానని చెప్పాడు. పోలీస్ యూనిఫారమ్, గన్ చూసి నూడిల్స్ బండి నిర్వాహకులు నిజమే అనుకున్నారు. పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగం ఖాళీగా ఉందని.. 4లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుందని చెప్పాడు. దీంతో ఎవరికో ఎందుకు తమ కుమారుడుకే ఇప్పించాలంటూ.. 4 లక్షలు వీరారెడ్డి చేతిలో పెట్టారు. తర్వత కొద్ది రోజులకు .. హోంగార్డు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయం గడిచిపోయిందని.. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయంటూ.. మరో 9 లక్షలు తీసుకున్నాడు. అయినా.. వీరారెడ్డి నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో హేమలత, వెంకటేశ్వర్ల దంపతులు.. వీరారెడ్డిని నిలదీశారు. కానిస్టేబుల్ ఉద్యోగం కూడ లేదని.. సీబీసీఐడీలో గన్ మెన్ ఉద్యోగం ఉందని చెప్పాడు. మరో 9 లక్షలు కావాలన్నాడు. నిజమని నమ్మిన హేమలత,వెంకటేశ్వర్ల దంపతులు ఇల్లు, బంగారం అమ్మి మరో 9 లక్షలు ఇచ్చారు. డబ్బు తీసుకుని అక్కల వీరారెడ్డి పరారీ అయ్యాడు. మోసపోయామని తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు హేమలత, వెంకటేశ్వర్లు. అయితే.. వీరారెడ్డి ఆచూకీ లేనందున పోలీసులు కేసు నమోదుచేయలేదు. బాధితులు డీజీపీ కార్యాలయాని ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.