భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటా: కత్తిరి రామ్మోహన్ రావు
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు : నిరంతరం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మదర్ థెరిస్సా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని కార్పొరేటర్ కత్తిరి రామ్మోహనరావు అన్నారు. స్థానిక జిల్లా సహకార బ్యాంకు సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న అసోసియేషన్ భవన నిర్మాణ సమయం వద్ద సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినపర్తి మాధవరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ కత్తిరి రామ్మోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు అండగా ఉంటూ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న అసోసియేషన్ కు అండగా ఉంటానని చెప్పారు. గతంలో ఒక కార్మికుడు అనారోగ్యంగా ఉన్నాడని, అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని మాధవరావు రాగానే మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడంతో ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా కోరుకున్నాడని చెప్పారు. అప్పటి నుంచి కార్మికులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మాధవరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కార్పొరేటర్ రామమోహనరావుతో పాటు మంత్రి ఆళ్ల నాని ఎంతో సహకారం అందిస్తున్నారని కొనియాడారు.కార్మిక శాఖ నుంచి కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులను కార్పొరేటర్ రామ్మోహన్ రావు చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బయ్యారపు రాజేశ్వరరావు,కోశాధికారి నమ్మిన లక్ష్మీ కుమారి,ప్రధాన కార్యదర్శి దేవరపల్లి రత్నబాబు,నాయకులు గొర్రిశెట్టి శ్రీనివాసరావు,నల్లగోపు సత్యనారాయణ,రాచేటి బాబురావు, గొర్రోశెట్టి శ్రీనివాసరావు,దుగ్గిరాల గౌరీశ్వరరావు,తోట నాగు, బత్తుల బుజ్జి, ఆదిరెడ్డి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.