ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం
1 min readపల్లెవెలుగువెబ్ : ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. హెచ్ఆర్ఏ కొంతమేర పెంచేందుకు, సీసీఏ కొనసాగించేందుకు, అదనపు క్వాంటం పెన్షన్ 70 ఏళ్ల నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. ఐఆర్ రికవరి చేయరాదని, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ లకు శుక్రవారం చర్చల్లోనే అంగీకరించిన మంత్రుల కమిటీ.. శనివారం ఇంకొన్ని మెట్లు దిగి మరిన్ని డిమాండ్ లపై సానుకూలంగా స్పందించింది. ఫిట్మెంట్ 23 శాతం కంటే పెంచాలన్న డిమాండ్ కు మాత్రం అంగీకరించలేదు. మెడికల్ రీయంబర్స్ మెంట్ సదుపాయాన్ని పొడిగించేందుకు సమ్మతించింది. ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే అంతిమ సంస్కారాలకు రూ. 25 వేలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు కూడ కొంత దిగివచ్చి ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. అయితే ఉద్యోగ సంఘాల నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాలు విభేదించారు. మొదటి డిమాండ్ అయిన 27 శాతం ఫిట్ మెంట్ కూడ సాధించుకోలేకపోయామన్నారు. 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమిస్తామని తెలిపారు.