తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..
1 min read– ఖండించిన పౌరహక్కుల నేతలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, కడప, కర్నూలు, విశాఖపట్నంలో పౌరహక్కుల నేతల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు సమాచారం చేరవేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారనే ఆరోపణతో విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ లో ఒక వార్త చానెల్ విలేకరి పై కేసు నమోదయ్యింది. తర్వాత ఆ కేసు ఎన్ఐఏ కు బదిలీ అయింది. దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు మార్చి 7న కొత్తగా మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్, గాజర్ల రవి తో పాటు మరో 64 మంది మీద ఐపీసీ, ఊపా, ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భద్రత చట్టం కింద కేసులు నమోదయ్యయి. ఈ కేసు దర్యప్తులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు మొదలైన సోదాలు.. రాత్రి పొద్దుపోయేదాక కొనసాగాయి. పెన్ డ్రైవ్ లు, పుస్తకాలు, సీడీలు, హార్డ్ డ్రైవ్లు పౌరహ్కుల నేతల ఇళ్లలో స్వాధీనం చేసుకన్నట్టు సమాచారం. కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, కర్నూలులో పినాకపాణి, అరుణ్(సోమశేఖరశర్మ), విశాఖపట్నంలో న్యాయవాది కె. పద్మ, చినవాల్తేరులో న్యాయవాది కె.ఎస్. చలం ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అటు హైదరాబాద్ లో న్యాయవాది రఘనాథ్, ప్రజాకళాకారుడు డప్పు రమేష్, జాన్ , సత్తెనపల్లెలో చిలుకా చంద్రశేఖర్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ప్రజా సంఘాల నోరు నొక్కేందుకే….
ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాల నోరు నొక్కేందుకు ఈ సోదాలు అని విమర్శించారు తెలంగాణ పౌరహక్కుల సంఘం నేతలు. అసమానతల మీద, ప్రభుత్వ విధానల మీద ప్రశ్నిస్తున్నందుకే.. తమ హక్కులు హరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అక్రమ సోదాలను ఖండిస్తున్నామని పౌరహక్కుల నాయకుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు.