కొలను భారతిలో ముగిసిన భీష్మ ఏకాదశి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: శ్రీ శారదా జ్ఞాన పీఠం ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుండి జరుగుతున్న భీష్మ ఏకాదశి మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. శారదా జ్ఞాన పీఠాధిపతులు పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ శివ యోగీంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో భజనలు, సత్సంగాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామీజీ ప్రవచించారు.భీష్ముడు సత్యవ్రతుడని, ప్రతిజ్ఞ అనగానే మనకందరికీ గుర్తుకువచ్చేది భీష్ముడేనని, ఇచ్చినమాటకు కట్టుబడే తత్వం ఈ మహనీయుని నుండి ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో లలితా పీఠం వ్యవస్థాపకులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ భారతీయ తాత్విక చింతనను మతం కోణంలో కాకుండా ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరమున్నదన్నారు. భగవద్గీత ప్రచారకులు మద్దయ్య స్వామి మాట్లాడుతూ ప్రతివ్యక్తి ముక్తిని చేరుటకు తరుణోపాయమైన విష్ణు సహస్రనామ స్తోత్రము అందించిన భీష్ముడు ప్రాతఃస్మరణీయుడన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ ఋషి పరంపర ఎంతో గొప్పదని అర్దం వెంటపడి పరమార్థాన్ని మరచిపోతున్నామని, భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పవలసిన అవసరం ఉన్నదని చాటారు.ఈ కార్యక్రమంలో శ్రీనగరం, కానాల, కాకనూరు, తదితర అనేక గ్రామాల భజనమండళ్ళతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాత్రంతా భజనలు చేశారు. భక్తులందరికీ శ్రీ శారదా జ్ఞాన పీఠం ఆధ్వర్యంలో అన్నసంతర్పణ జరిగినది.