వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
1 min read – నివాళి అర్పించిన కలెక్టర్ జి. వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్, బనగానపల్లెః యూనిట్ 27 మద్రాస్ ఇండియన్ ఆర్మీ (ఫాజిలక్, పంజాబ్) లో 30 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్న వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ మార్చి 30న మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాతి ఆర్మీ అధికారులు వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ మృత దేహాన్ని మండల కేంద్రమైన బనగానపల్లెకు తీసుకువచ్చారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె.పక్కీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డోన్ డిఎస్పి నరసింహారెడ్డి, బనగానపల్లి సీఐ సురేష్ కుమార్ రెడ్డిలు వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ పార్థివదేహం వద్ద పూల గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సైనిక లాంఛనాలతో.,
వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. మండల కేంద్రంలోని రంగరాజు వీధిలో వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ పార్థివ దేహంపై జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించారు. వీర జవాను తుది వీడ్కోలు పలకడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీర జవాన్ నాయక్ దలాల్ షఫీ పార్థివదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు.