ఎన్నికలు.. పక్కాగా.. పకడ్బందీగా జరగాలి
1 min readమోడల్ కోడ్ ను పగడ్బందీగా అమలు చేయండి :-
– కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేయండి
– నోడల్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ పేర్కొన్నారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక జెడ్పీలోని మినీ మీటింగ్ హాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్ల పై జిల్లా నోడల్ టీమ్ అధికారులతో జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.పక్కీరప్ప సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు అభివృద్ధి) రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, నోడల్ టీమ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ మాట్లాడుతూ జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి ఎంసిసి టీమ్ లు ప్లేయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ రూరల్ ఏరియాలో రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలు, బ్యానర్లు, వాల్ రైటింగ్ ఎన్నికల ఉల్లంఘనపై గట్టి నిఘా ఉంచి క్షేత్రస్థాయిలో మోడల్ కోడ్ ను పగడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఎన్నికలపై.. శిక్షణ ఇవ్వండి..
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించాలని ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్స్ ను పగడ్బందీగా చేయాలని సంబంధిత నోడల్ అధికారులకు సూచించారు. అన్ని నోడల్ టీమ్ అధికారులుమండల ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లన్నీ సత్వరమే పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్ సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు బాగా చేయాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.