ఒంటరిగా వదిలేశారు.. అధ్యక్షుడి ఆవేదన !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని వాపోయారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘మన దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారు’’ అని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.