త్వరలో కొత్త పార్టీ..?
1 min readతెర వెనుక ముమ్మర ప్రయత్నాలు
ప్రాంతీయ పార్టీతోనే టీఆర్ఎస్ కు చెక్
ఏకమవుతున్న కేసీఆర్ వ్యతిరేకులు
హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోబోతుందా?. అంటే. అవుననే అంటున్నారు చాలా మంది టీఆర్ఎస్ వ్యతిరేకులు. గులాబీ బాస్ కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదంటున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసి.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారంటున్నారు. ప్రాంతీయ పార్టీ అయితేనే టీఆర్ఎస్ తో గట్టిగా తలపడగలదని చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడ విస్వసిస్తున్నారు. పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అన్న ప్రశ్న ఇప్పుడు మొదలైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని మరీ తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకుల్ని కలిసి పోరాడాలని కోరుతున్నారు. ఇటీవలే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్ తదితరుల్ని కలిసినట్టు స్వయంగా ఆయనే చెప్పారు. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకమై పార్టీ పెడితే తాను కలసి వస్తానని, లేనిపక్షంలో బీజేపీలో చేరతానని బాహాటంగానే చెప్పారు. ఈ విషయం మీద చర్చించేందుకు రేవంత్ రెడ్డిని కూడ త్వరలోనే కలుస్తానని ఆయన చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడ ప్రాంతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడన్న వార్తలు కూడ ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ మార్కు రాజకీయాలతో టీఆర్ఎస్ తో తలపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. ప్రాంతీయ పార్టీతోనే టీఆర్ఎస్ ను ఎదుర్కోగలం అన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే..కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదు. తెలంగాణలో ప్రజలు మరో ప్రాంతీయ పార్టీని చూడవచ్చు.