కళాకారుల విశ్వరూపం
1 min readటీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు వెబ్: కర్నూలు: శివరాత్రి జాగారం సందర్భంగా కళాకారులకు తమ నట విశ్వరూపాన్ని చాటుకునే అవకాశం కలిగిందని టీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు, విశ్వ కళాసమితి కన్వీనర్ హనుమంతరావు చౌదరి అన్నారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామం దగ్గర పూల శివన్న తోటలో శివరాత్రి జాగరణ సందర్భంగా పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. పూల అనుమన్న, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన నాటకాలలో హనుమంతరావు చౌదరి దుర్యోధనుడిగా అలరింప చేశారు. విశ్వ కళా సమితి అధ్యక్షుడు లక్ష్మన్న, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి కేశన్న, హార్మోనిస్టు పీజీ వెంకటేశ్వర్లు, మహిళా కళాకారిణి గొల్లపూడి రేణుక, నాయుడు, జల్లబాబు, శంకర్ రెడ్డి, ప్రభుదాసు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ఎలాంటి అవకాశాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డ కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొని తెల్లవార్లు జనంతో వన్స్ మోర్ అనిపించుకున్నారు. ప్రేక్షకుల చప్పట్లు.. ఈలలు కేరింతల మధ్య నాటకాల ప్రదర్శన ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ కరోనా ప్రబలినప్పటి నుంచి సమాజంలో అన్ని వర్గాల నుంచి కళాకారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ధికంగా చితికిపోయినా.. కళా రంగంపై మక్కువతో సొంత డబ్బుతో అనేక వ్యయ ప్రయాసలకోర్చి నాటకాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. సమాజ సంతోషాన్ని కోరుకునే కళాకారులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆట పాటలను భావి తరాలకు అందించే విషయాన్ని విస్మరించరాదని హనుమంతరావు చౌదరి పేర్కొన్నారు.