PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మహానంది తహసీల్దార్​’ పేరుకుపోతున్న ఫైళ్లు..!

1 min read

పల్లెవెలుగువెబ్​,మహానంది: మహానంది మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఫైళ్లు పేరుకు పోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు భూ సమస్యలపై పలు విధాలుగా పలుమార్లు కార్యాలయ అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని బాధితులు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. స్పందన కార్యక్రమానికి కూడా  హాజరైన రైతులు  దరఖాస్తులు అందజేసినా వారికి తగిన రసీదులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది తాసిల్దార్ కార్యాలయంలో పొలం విషయంలో సంప్రదించగా కొలతలు వేయాలని సూచించారని అధికారులు పేర్కొన్నట్టు బాధిత రైతులు తెలిపారు. కొలతలు వేసి సంవత్సరం పూర్తి అవుతున్న నేటికీ పరిష్కారం కాకపోవడంతో పాటు ఒకే ఒక్కసారి నోటీసులు అందజేసి చేతులు దులుపుకోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా పొలం విషయంలో  తగాదాలు ఏర్పడినప్పుడు కొలతలు  వేసిన అనంతరం రికార్డులు పరిశీలించి  నిర్ధారణ చేసి ఇరువైపుల వారికి మూడు సార్లు నోటీసులు జారీ చేస్తారు. కానీ ఇక్కడ సంవత్సరం పైబడిన ఒకే ఒక్కసారి నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకోవడం వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. పేద రైతులు తమ పొలాన్ని ఆన్లైన్ లో నిక్షిప్తం చేసుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది .లేదంటే రైతులు పొలం ఉన్నా ఎలాంటి  ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలు అందవు అనేది నిర్వివాదాంశం .ఇది అధికారులకు తెలియనిది కాదు .కానీ అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు అండదండలు లేనివే ఏ  ఫైలు ముందుకు కదలని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని ఆర్థిక కారణాలు కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం .రెవిన్యూ వ్యవస్థలో కొందరు అధికారులు, సిబ్బంది సహాయ నిరాకరణ కార్యక్రమం చేపట్టడంతో గ్రామాల్లో వర్గ పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. వర్గాల ఆధిపత్య పోరును సమర్థిస్తున్నారా…? లేక ప్రోత్సహిస్తున్నారా..? అనేది తేలాల్సి ఉందని రైతులు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు మరియు సిబ్బందిపై పలు ఆరోపణలతో పాటు పై అధికారులకు కూడా  కొందరు రైతులు అధికారులకు చేర వేయనున్నట్లు  సమాచారం .కొందరు రైతులు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినా ఆరు నెలలైనా ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం పలు ఆరోపణలకు  తావిస్తోంది. అధికారులు గ్రామాల్లో రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారా..?  లేక పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారా…?  లేక ప్రజాప్రతినిధుల ఆకాంక్ష మేరకు నిలుపుదల చేస్తున్నారా…? అనేది తేలాల్సి ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో గొడవలకు దారి తీసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సంఘటనలు ఉన్నట్లు తెలుస్తుంది .ఏది ఏమైనా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారా..! లేక నాన్చుడు ధోరణితో వివాదాలకు కారణం అవుతారా…?  అనేది తేలాల్సి ఉంది అని రైతులు భావిస్తున్నారు .దీనికి పరిష్కారం ఏమిటి అనేది రెవెన్యూ వర్గాల్లోని కొంతమంది చేతుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

About Author