దొంగలకు నెల జీతం ఇస్తున్న కంపెనీ !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజస్థాన్ లోని జైపూర్ లో ఆసక్తికర ఘటన జరిగింది. దొంగలకు నెల జీతం ఇస్తూ కంపెనీ పెట్టాడో గజదొంగ. ఆ దొంగలంతా ప్రత్యేకంగా ‘దొంగల కంపెనీ’కి నెలకు రూ.30వేల జీతానికి పనిచేస్తున్నారు. నెల తిరిగేసరికి ఫస్టు తారీఖున ఠంచనుగా జీతం డబ్బులు చేతికందుతాయి. చోరకళలో ప్రతిభ కనబరిస్తే కంపెనీ నుంచి ప్రోత్సాహకాల రూపంలో అదనంగా కొంత డబ్బు జేబులో పడుతుంది. ఇదంతా తెలిసి కొన్ని వేల కేసులను చూసిన పోలీసులే తల పట్టుకున్నారు. ఇంతకీ రిక్రూట్ చేసుకున్న ఆ దొంగలు చేసే పని ఏమింటటే.. బైక్‌లు, ఈ-రిక్షాలు మాయం చేయడం.. వాటిని ఇంజన్లు, టైర్లు, బ్యాటరీలుగా ముక్కలు ముక్కలు చేసి తుక్కు కింద అమ్మేయడమే. ఇందుకు ఇర్ఫాన్ అనే వ్యక్తి ప్రత్యేకంగా ఓ కంపెనీయే పెట్టాడు. దొంగతనం నుంచి వాటిని విడిభాగాలుగా చేయడం, వాహనాల్లో తరలించడం, ఆ సరుకును తుక్కు కింద అమ్మేదాకా ఏ దొంగ ఏ పని చేయాలి? అనేది ఫిక్స్ చేస్తారు. అలాగే ఏ పని చేసే వారికి ఆ మేరకు జీతాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ సహా పది మంది దొంగలను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు.