ఏసీబీ వలలో.. అవినీతి అధికారి.!
1 min read– ఇంటి నిర్మాణానికి రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరి
– ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
– రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
పల్లె వెలుగు వెబ్, అవుకు : ఇల్లు కట్టుకుంటాం… అనుమతి ఇవ్వాలని అడిగిన ఓ వ్యక్తిని.. రూ.20వేలు లంఛం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారి.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇంటి నిర్మాణం కోసం గత కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పుకున్న ఓ అవినీతి అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో.. సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఘటనలో కర్నూలు జిల్లా అవుకు మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుంకేసుల గ్రామపంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌కు సుంకేసుల గ్రామానికి చెందిన వెంకటేశ్వ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతి మంజూరు చేయడంలో పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ ఆలస్యం చేస్తుంటే.. అనేకసార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన వెంకటేశ్వర్ రెడ్డి విసిగిపోయారు. రూ.20,000 లంచం ఇస్తేనే ఇంటి నిర్మాణం అనుమతులు ఇస్తాను అని తెగేసి చెప్పడంతో గత్యంతరం లేక బాధితుడు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పి నారాయణస్వామి ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం రూ.500ల గల 20 నోట్లను వెంకటేశ్వర్ రెడ్డి ద్వారా పంచాయతీ సెక్రెటరీ కి అందిస్తుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. విచారణ చేపట్టిన అంతరం రికార్డులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శివ నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తమను ఆశ్రయించాలని అన్నాడు.నేరుగా కార్యాలయంలోకి వచ్చి ఫిర్యాదు చేస్తే బాధితులకు పూర్తి రక్షణ కల్పించడమే కాక వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.