అవినీతి సొమ్ము.. రూ.5 లక్షలు కాల్చివేత
1 min readఅక్రమ సొమ్మును.. టీఆర్ఎస్ నాయకుడితో వసూలు చేయిస్తన్న వెల్దండ తహసీల్దార్
పల్లెవెలుగు, కల్వకుర్తి: అవినీతి సొమ్ముతో .. ఏసీబీకి పట్టుబడతానని భావించిన ఓ నాయకుడు.. రూ. 5లక్షల నోట్లను కాల్చివేశాడు. 70 శాతం కాలిపోయినా.. సదరు నాయకుడు ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం కోరింతతండాకు చెందిన రాములు నాయక్ వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామంలో తనకున్న 15 ఎకరాల పొలంలో క్రషర్ మిషన్ ఏర్పాటుకు, మైన్స్ తీసుకోడానికి వీలుగా మైన్స్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. సదరు అధికారులలు వెల్దండ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ఓసీ తీసుకురావాలని సూచించారు. ఇదే అదునుగా భావించిన వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ … ఎన్ఓసీ కోసం టీఆర్ఎస్ నాయకుడు , మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్‌ను కలవాలని సూచించాడు. ఆ నాయకుడి దగ్గరకు వెళ్లిన రాములునాయక్‌ను రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రాములు నాయక్ ఏసీబీ అధికారులను సంప్రదించగా… వారిచ్చిన రూ.ఐదు లక్షలను కల్వకుర్తి పట్టణంలో ఉన్న వెంకటయ్య గౌడ్ కు అందజేశాడు.
ఏసీబీ.. ఆకస్మిక దాడులు..
రాములునాయక్ డబ్బులు ఇచ్చి ఇంటి నుంచి బయటకు రాగానే.. ఏసీబీ అధికారులు దాడికివచ్చారని పసిగట్టిన సదరు నాయకుడు వెంకటయ్య గౌడ్. వెంటనే రూ.5లక్షల నోట్లను ఇంటిలోని వంట గ్యాస్‌స్టౌపై కాల్చివేశాడు. ఏసీబ డీఎస్పీ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తలుపులు లాగేసి.. లోపలికి వెళ్లి మంటల్లో కాలిపోతున్న నోట్లను బయటకు తీశారు. అప్పటికే 70 శాతం కాలిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటయ్య గౌడ్ తో పాటు తహసీల్దార్ సైదులు గౌడ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు.