హాలీవుడ్ తరహాలో.. ఏపీలో మద్యం మాఫియా !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్‌రెడ్డి హాలీవుడ్ సినిమాల తరహాలో రాష్ట్రంలో మద్యం మాఫియాను సృష్టించారని ఆరోపించింది. రాష్ట్రంలో అమ్మే ప్రతి మద్యం సీసాపైనా జే ట్యాక్స్ విధించి వసూలు చేస్తున్నారని విమర్శించింది. ఈ రకంగా నెలకు రూ.200 కోట్ల చొప్పున, అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో రూ.7,000 కోట్లు వసూలు చేసి తాడేపల్లి ప్యాలె్‌సకు తరలించారని టీడీఎల్పీ ఆరోపించింది. ‘‘రాష్ట్రంలో అమ్మే మద్యం బ్రాండ్లు, వాటిని తయారు చేసే డిస్టిలరీలు, వాటి రవాణా, అమ్మకం వ్యవస్థ… మొత్తాన్నీ ముఖ్యమంత్రి తన అధీనంలో పెట్టుకొని నడిపిస్తున్నారు. సొంత వ్యవస్థను తయారు చేసి పెట్టుకొని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారికంగా అమ్ముతున్న మద్యం నుంచి ముఖ్యమంత్రికి అందుతున్న ముడుపుల గురించే మేం ఈ లెక్కలు చెబుతున్నాం. కానీ దీనికి సమాంతరంగా రాష్ట్రంలో అనేక వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అక్రమంగా అమ్ముడవుతోంది. దాని నుంచి ఆయనకు ఎంత అందుతోందో ఎవరికీ ఊహకు అందడం లేదు. జగన్‌రెడ్డి రావడానికి ముందు మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయి. ఆయన రాగానే వారినందరినీ తొలగించి ప్రభుత్వ మద్యం షాపులు పెట్టారు“ అని టీడీఎల్పీ విమర్శలు చేసింది.