శ్రీశైలంలో…30 నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం
1 min read- 30 వరకు స్పర్శదర్శనం
- పల్లెవెలుగు వెబ్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటక నుంచి పాదయాత్రగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈ ఓ లవన్న నేతృత్వంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. కేవలం ఒక క్యూలైన్ మాత్రమే భక్తులకు స్పర్శదర్శనం కోసం అనుమతించారు. ప్రస్తుతం స్వామివారి దర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.
క్యూలైన్లలో.. అల్పాహారం…
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం వచ్చిన భక్తులు ఆదివారం క్యూలైన్లలో వేకువ జాము నుంచే వేచి వున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వుండేందుకు నిరంతరం మంచినీరు, బిస్కెట్లు అందజేయబడుతున్నాయి. అదేవిధంగా ఉదయం వేళలో పాలు, ఎప్పటికప్పుడు అల్పహారాలు అందజేయడం జరుగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం పర్యవేక్షకులకు ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయి. ఎప్పటికప్పుడు కార్యనిర్వహణాధికారి వారు పరిస్థితులను సమీక్షిస్తూ ఆయా విభాగాల అధికారులకు ఆయా సూచనలు చేయడం జరుగుతోంది. దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.