గొడవ తర్వాత.. శ్రీశైలంలో తెరుచుకున్న దుకాణాలు
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీశైలంలో షాపులు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి జరిగిన గొడవతో దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. శ్రీశైలంలో నిర్వహించే ఉగాది ఉత్సవాలకు కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి 12.30గంటలకు ఓ కన్నడ భక్తుడు పాతాళగంగ మార్గంలోని బీరప్ప సదనం వద్ద టీ తాగేందుకు దుకాణం వద్దకు వెళ్లి తాగేందుకు మంచి నీళ్లు అడిగాడు. వాటర్ బాటిల్ ధర విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కన్నడ భక్తుడిని దుకాణ యజమాని చలాకుతో కొట్టాడు. దీంతో కన్నడ భక్తుడి తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న మిగతా కన్నడ భక్తులు టీ షాపుపై దాడికి దిగారు. సామగ్రిని ధ్వంసం చేసి నిప్పంటించారు. అనంతరం పలుచోట్ల విధ్వంసానికి తెగబడి దుకాణాలపై దాడి చేశారు. . ఈవో ఎస్.లవన్న, పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య వాహనాల్లో తిరుగుతూ భక్తులకు నచ్చజెప్పే యత్నం చేశారు. కన్నడ భక్తులను పీఠాధిపతి శాంతింపజేశారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ శృతి శ్రీశైలానికి వచ్పి స్థానిక వ్యాపారులతో చర్చించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో యధావిధిగా దుకాణాలు తెరుచుకున్నాయి.