రాజన్న రాజ్యం స్థాపిస్తాం: వైఎస్ షర్మిల
1 min readఖమ్మం: తెలంగాణలో తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు వైఎస్ షర్మిల. జులై 8న పార్టీ జెండా, పేరు ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ కోసం నిలబడతా.. పోరాడుతా.. కేసీఆర్ దొరను ప్రశ్నిస్తా అంటూ ఖమ్మంలో సంకల్పంబూనారు. శుక్రవారం ఖమ్మంలో సంకల్ప దీక్ష సభను నిర్వహించారు. ఈసభకు వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఉద్యోగాలన్నీ దొర ఇంటికే చేరాయి కానీ.. నిరుద్యోగులకు రాలేదని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని, తల, తోక తీసేసి.. రిజైన్లు చేసి కోట్ల రూపాయల కమిషన్ దండుకుంటున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం దొర కాళ్లకింద నలిగిపోతోందని, ప్రశ్నించడం కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.
తెలంగాణలో వైఎస్ రాజ్యం: తెలంగాణలో అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తామని ప్రకటించారు. రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. ఒకవేళ అధికారం రాకపోయినా.. ప్రజల కోసం పోరాడతామని చెప్పారు. తాను తెలంగాణ బిడ్డనేనని, ఇక్కడే పుట్టి పెరిగానని, ఇక్కడే పెళ్లి చేసుకున్నానని.. ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని తెలిపారు. తాను రాజన్న బిడ్డని..ఎవరో పంపితే రాలేదని, ఎవరి కిందకు వెళ్లనని స్పష్టం చేశారు.
ఆత్మహత్యలు వద్దు : కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని నిరుద్యోగులను కోరారు. కొలువుల కోసం పోరాడాలని కోరారు. లక్షా 91 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం భర్తీ చేయడంలేదని విమర్శించారు. నిరుద్యోగుల తరపున తాను పోరాడుతానని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఇచ్చారు.
త్వరలో నిరాహార దీక్ష : ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో తమ పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తారని ప్రకటించారు. ఈప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోతే.. తమ పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. రాజన్న రాజ్యం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.