ముఖ్యమంత్రి సోదరి.. టీ దుకాణం నడుపుతూ జీవనం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యానాథ్ సొంతూరు ఉత్తరాఖండ్‌లోని కొఠారి గ్రామం. యోగి ఆదిత్యానాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్ . 18 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ ఆశ్రమంలో చేరి ఆదిత్యనాథ్‌గా తన పేరును మార్చుకున్నారు. ఆ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పటికీ యోగి సోదరి శశి సింగ్ ప్రస్తుతం తన గ్రామంలో చిన్న టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె ప్రతిరోజూ రెండున్నర కిలోమీటర్లు నడిచి కొండ ఎక్కుతుంది. అక్కడ ఉన్న పార్వతీ దేవి ఆలయం ముందు టీ, స్నాక్స్, ప్రసాదం అమ్ముతుంటుంది. ఆమె భర్త పురాణ్ సింగ్ అక్కడే కప్పులు కడుగుతుంటాడు. సోదరుడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా శశి సింగ్ మాత్రం సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడుతోంది. తమ సోదరుడి నుంచి తామేం ఆశించడం లేదని, కాకపోతే ఒకసారి ఇంటికి వచ్చి తల్లిని కలవాలని సోదరుడికి ఆమె విజ్ఞప్తి చేసింది.