ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్: క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మార్తాల వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.. బుధవారం ఉదయం రాయచోటి మండలం సుండుపల్లి రోడ్డు లోని ఆదర్శ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు పరిచే పథకాలు పటిష్ఠంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంని తనిఖీ చేశారు. అక్కడ పదవ తరగతి విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాలికా విద్య కోసం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉందన్నారు. బాలికలు ఎందులోనూ తక్కువ కాదని , ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం పరిశీలన:
అనంతరం కొత్తపేటలోని ఎంఆర్సి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కడప, చిత్తూరు డీఈఓ కార్యాలయాల నుంచి ఎంత మంది సిబ్బందిని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి కేటాయించింది అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బందిని సమావేశపరిచి పలు సూచనలు చేశారు. నూతనంగా ఏర్పడిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర వసతుల కొరత ఉన్నందున కడప డీఈఓ కార్యాలయం నుంచి 40 శాతం, చిత్తూరు డీఈఓ కార్యాలయము నుంచి 20% ఫర్నిచర్, ఇతర సామాగ్రిని వెంటనే తరలించాలని ఆయా డీఈవో లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డీఈవో రాఘవరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమలత, పిఆర్టియు రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.