‘తోట’కు మంత్రి పదవి ఇస్తే…
1 min readజనసేనను నియంత్రించే సత్తా… తోట త్రిమూర్తులుకే ఉంది..
- ఆతృతగా ఎదురుచూస్తున్న ‘కాపునాడు’
- సీనియర్ జర్నలిస్టు యర్రా జయదాసు
పల్లెవెలుగు వెబ్, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాలలో పట్టున్న శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులుకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని గోదావరి జిల్లాల ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సీనియర్ శాసన సభ్యునిగా ఆయనకు ఎంతో అనుభవం ఉంది. సామాన్యుడికి సైతం సాంఘిక న్యాయం, సమన్యాయం చెయ్యాలని ఆయన ఉవ్విళ్లూరుతుంటారు. 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో తలపండిన తోట, ఎన్టీఆర్ ప్రభంజనం లో, ఎన్టీఆర్ ప్రభావాన్ని అడ్డుకుని 1995లో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి తనదేమిటో జిల్లా ప్రజలకు సత్తా చూపించారు.
ఎమ్మెల్యేగా… నాలుగు పర్యాయాలు..
నాలుగు పర్యాయాలు రామచంద్రపురం శాసనసభ్యునిగా పని చేసిన విశేష రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ప్రతి నియోజకవర్గంలో ఆయనకు అనుచరగణం, అభిమానగణం ఉండేది. తన దగ్గరకు వచ్చిన సామాన్యులు, బడుగు, బలహీన వర్గాలకు సైతం తన చేతనైన సాయం చేసి వారిని చిరునవ్వుతో సాగనంపేవారు. రాజకీయం అంటే ప్రజాసేవ అని నిర్వచనం తీసుకువచ్చారు. తనను నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలను, అభిమానులను ఆయన ఏనాడు నిరుత్సాహ పరచలేదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధికి గంటల తరబడి పనిచేసి నిరంతర ప్రజా సేవలో నిమగ్నమవుతున్నారు. తోట త్రిమూర్తులకు 2014లోనే మంత్రి పదవి రావాల్సి ఉంది. అయితే ఓ ప్రధాన సామాజిక వర్గం ఆయనకు మంత్రి పదవి ఇస్తే తమ మనుగడ కష్టమవుతుందని తమ అధినాయకుడుకి చెప్పి ఆయనకు మంత్రి పదవి రాకుండా నిరోధించగలిగారు.
అయితే తోట ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ప్రజలు తన వెంట ఉన్నప్పుడు తనకు మంత్రి పదవి తో పని ఏముందని తాను చెప్పిన పని ప్రతి మంత్రి చేస్తారనే ధీమాతో ప్రజలను కార్యకర్తలను ఆయన కాపు కాస్తూ ఉంటారు.
పనితనం మెచ్చిన… అధినేత…
ఈ నేపథ్యంలో లో 2019 ఎన్నికల్లో ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో ఓటమి చవి చూసినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యదీక్షకు, పనితనానికి మెచ్చి పార్టీలోకి ఆహ్వానించి కోనసీమ జిల్లాకు వైయస్ఆర్సీపీ అధ్యక్షునిగా నియమించారు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలో నలుగురు ఇన్చార్జిలు పని చేసినప్పటికీ, ఫలితం లేకపోవడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులను మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జిగా నియమించారు. తోట ఆ బాధ్యతలు స్వీకరించగానే నియోజకవర్గం రూపురేఖలు, రాజకీయ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికే పురపాలక సంఘం, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి తోట భుజస్కంధాలపై పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 95శాతం సర్పంచ్ అభ్యర్థులను విజయం సాధించడమే కాకుండా పురపాలక సంఘ ఎన్నికల్లో 30 మంది కౌన్సిలర్ లకు గాను 22 మంది కౌన్సిలర్లను గెలిపించిన ఘనత తోటకు ఉంది. అదేవిధంగా రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట రూరల్ మండలాల్లో జడ్పీటీసీ అభ్యర్థులను, ఎంపీటీసీ అభ్యర్థులను, ఎంపీపీ అధ్యక్షులను విజయపథం వైపుకు నడిపించి అన్ని గ్రామాల్లో వైయస్సార్సీపి జెండాను ఎగురవేసిన ఘనత తోట త్రిమూర్తులకే దక్కింది.
మాట ఇస్తే…కట్టుబడి ఉండే నైజం…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా మాట ఇస్తే ఆ మాట కు కట్టుబడే వ్యక్తి తోట త్రిమూర్తులు. అభివృద్ధిలో ఏ మాత్రం రాజీపడక పార్టీ సిద్ధాంతాల కోసం క్రమశిక్షణ కలిగిన సైనికుడి మాదిరిగా పోరాటయోధుని వలే పనిచేయడం ఆయన సహజ గుణం. 2024లో జరిగే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటే తోట త్రిమూర్తులకు రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం తోట వెన్నంటే ఉంది. కాపునాడు నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి వారికి దిశ దశ నిర్దేశం చేసే సత్తా ఆయనకే ఉంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలను నియంత్రించే శక్తి సామర్ధ్యాలు తోటకే ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే గోదావరి జిల్లాలలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వైసీపీకే దక్కుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించి, వివిధ నివేదికలు పరిశీలించి తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇస్తారని ఆశిద్దాం.