రైతులకు శుభవార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగు నెలల నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి భారత వాతావరణ శాఖ గురువారం తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల (లాంగ్ పీరియడ్ యావరేజ్ 96-104 శాతం) రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం 99 శాతం (ఐదు శాతం అటు ఇటు కావచ్చు) నమోదుకానున్నది. 1971 నుంచి 2020 వరకు వర్షపాతం వివరాలు తీసుకుంటే.. దీర్ఘకాల సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా లెక్కగట్టారు. నాలుగు నెలల సీజన్‌లో దక్షిణభారతం ఉత్తర భాగం దానికి ఆనుకుని మధ్యభారతం, వాయువ్య భారతంలో కొన్ని ప్రాంతాలు, హిమాలయ సానువుల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలు, వాయువ్య భారతంలో కొన్ని ప్రాంతాలు, దక్షిణభారతంలోని దక్షిణభాగంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.