సీఎం టూర్ అంటూ కారు లాక్కున్న పోలీసులు.. రోడ్డు పై కుటుంబం !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కాన్వాయి కోసం రోడ్డుపై వెళ్తున్న కార్లను పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. వినుకొండ నుంచి తిరుమల దర్శనానికి వెళ్తున్న శ్రీనివాస్ కారుని పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అర్థరాత్రి రోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. శ్రీవారి దర్శనానికి వినుకొండ నుంచి కుటుంబంతో కారులో వెళుతుంటే ఒంగోలులో పోలీసులు తన కారును ఆపారని శ్రీనివాస్ అనే వ్యక్తి మీడియాకు చెప్పారు. సీఎం పర్యటన పేరుతో తన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. రాత్రి సమయం కావడంతో భద్రత కోసం ఆర్టీసీ డిపోలో తలదాచుకున్నామని, మరో వాహనం ఏర్పాటు చేసుకుని తిరుమలకు వచ్చామని శ్రీనివాస్ తెలిపారు.