పెరిగిపోతున్న మూఢవిశ్వాసం
1 min read– మరో మదనపల్లి ఘటన ?
పల్లెవెలుగు వెబ్: దేశంలో మూఢ విశ్వాసం రోజురోజుకూ పెరిగిపోతోంది. మానవ మేధస్సు కన్న గొప్ప శక్తి లేదన్న వాస్తవం మరిచి.. లేని అతీంద్రియ శక్తుల కోసం ప్రాణాలు బలిగొంటున్నారు. ఇటీవల మదనపల్లిలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. మూఢత్వంలో ఆ తల్లిదండ్రులు చేసిన పనులు ఒళ్లు గగుర్పాటుకు గురిచేశాయి. ఈ ఘటన మరవక ముందే తమిళనాడులో ఇలాంటే ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటనలో పిల్లలు తెలివైనవారు కావడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. లేదంటే మదనపల్లి అమ్మాయిలలాగే బలిపశువులయ్యేవారు.
ఎక్కడ జరిగింది?..: తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగపాళ్యంలోని రైల్ నగర్ లో రామలింగం, రంజిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రామలింగం చీరల వ్యాపారం చేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఇందుమతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రామలింగం పెద్ద భార్య ఉంటున్న ప్రాంతంలోనే .. చిన్న భార్యతో కాపురం పెట్టించాడు. ఇందుమతికి ధనలక్ష్మి అనే స్నేహితురాలు ఉంది. అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చేది. కొద్దికాలం తర్వాత ధనలక్ష్మికి రామలింగం పెద్ద భార్య రంజితతో పరిచయం ఏర్పడింది. వారి స్నేహాన్ని గమనించిన రామలింగం రంజిత, ధనలక్ష్మిలు ఇద్దరూ శివపార్వతుల్లా ఉన్నారంటూ వచ్చాడు.
రంజిత, ధనలక్ష్మి పెళ్లి: రంజిత, ధనలక్ష్మిలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. విషయం రామలింగానికి చెప్పగా.. సరేనన్నాడు. తన ఇంట్లోనే పిల్లల సమక్షంలో పెళ్లి చేశాడు. రంజితను పెళ్లి చేసుకున్న ధనలక్ష్మిని నాన్న అని పిలవాలని.. తనను మామా అని పిలవాలని రామలింగం పిల్లలను హింసించాడు. శానిటైజర్ తాగించడం, ఒంటికి కారం పూసి ఎండలో పడుకోబెట్టడం లాంటి చిత్రహింసలకు గురిచేశాడు. పిల్లలను స్కూలు మాన్పించాడు.
ఏం జరిగింది? : వీరి పిచ్చి చేష్టలు పిల్లలు గమనించారు. పిల్లలను బలి ఇవ్వాలని రంజిత, రామలింగం, ధనలక్ష్మిలు మాట్లాడుకోవడం పిల్లలు గ్రహించారు. విషయం అర్థం చేసుకుని తెలివిగా..తప్పించుకుని తమ తాత వద్దకు చేరుకున్నారు. జరిగిన విషయం తాతకు వివరించారు. పిల్లలతో కలిసి వారి తాత ఈరోడ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంజిత, రామలింగం, ధనలక్ష్మిలను విచారిస్తున్నారు. పిల్లలు జాగ్రత్తపడటంతో ప్రమాదం తప్పింది. లేదంటే పరిస్థితి ఊహించలేం. మూఢ విశ్వాసంతో పిల్లలనే బలి ఇవ్వాలన్న కోరికను ఏమనాలో అర్థం కాదు. ఖచ్చితంగా ఇది ఒకరకమైన మానసిక సమస్యే. ఇలాంటి వారిని గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోతే… మదనపల్లి ఘటనలు పునరావృతం కాక తప్పదు.