న్యాయం ..అందని ద్రాక్షగా మారకూడదు: జడ్జి రాజారాం
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూర్: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మే డే ను పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జై కిసాన్ పార్కు నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ సివిల్ జడ్జి రాజారాం, పట్టణ సిఐ నాగరాజ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్యానెల్ న్యాయవాదులు వెంకట్ రాముడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి,మండల న్యాయ సేవా సాధికారిక సంస్థ చైర్మన్ రాజారాం మాట్లాడుతూ మండల లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతి పేదవాడికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి పనిచేస్తుందన్నారు. అదే విధంగా ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ న్యాయం పేదవాడికి అందని ద్రాక్షగా మిగలకూడదని మార్గనిర్దేశం చేసిందన్నారు. అందుకే ప్రజలకు ఉచిత న్యాయ సేవలు పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కార్మిక, వామపక్ష పార్టీల సంఘాల నాయకులకు సూచించారు. ఏ సమస్యనైనా పరిష్కార మార్గం దిశగా ఆలోచన చేయాలంటూ జాతీయ లోక్ అదాలత్ లాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్మికులు తమ హక్కుల పరిరక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కార్మిక చట్టాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పానల్ న్యాయవాదులు కొంగరి వెంకటేశ్వర్లు , వెంకటరమణ, సిపిఐ నాయకులు రఘురాం మూర్తి, రమేష్ బాబు, సిపిఎం నాయకులు నాగేశ్వరరావు, పకీర్ సాహెబ్, ఏఐటీయూసీ సిఐటియు, కార్మికులు పారా లీగల్ వాలంటీర్స్ ప్రజలు పాల్గొన్నారు.