పిడకల సమరం..!
1 min read– కాళికాంబదేవి, వీరభద్రస్వామి వారి ప్రేమకు చిహ్నం
– భారీగా తరలివచ్చిన భక్తులు
పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పూర్వీకుల నుంచి వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలోని కాళికాంబదేవి,వీరభద్ర స్వామి వారి ప్రేమకు చిహ్నంగా.. ఉగాది పర్వదినం మరుసటి రోజు పిడకల సమరం… అంగరంగ వైభవంగా నిర్వహించారు. నుగ్గులాట( పిడకల సమరం)లో జిల్లా నుంచే కాక కర్ణాటకలోని రాయచూరు, తెలంగాణ ప్రాంతాల భక్తులు పాల్గొనడం విశేషం.
అసలు కథ..: ఆస్పరి మండలంలోని కారుమంచి గ్రామం నుంచి నాగభూషణ్ రెడ్డి రెడ్డి అనే వ్యక్తి అశ్వం మీద వచ్చి…కైరుప్పలలోని వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారికి టెంకాయ సమర్పించిన తరువాత గ్రామంలో పిడకల సమరం జరుగుతోంది. రెండు మూడు నెలల నుంచే కైరుప్పల గ్రామంలో పిడకలు తయారు చేసి.. భక్తుల కోసం సిద్ధంగా ఉంచుతారు. వీరభద్ర స్వామి భక్తుల ఒక వర్గంగా, కాళికాంబ దేవి భక్తులు మరో వర్గంగా విడిపోయి… నుగ్గులాట ( పిడకల సమరం)లో పాల్గొంటారు. స్వామి అమ్మవవార్ల కళ్యాణోత్సవం రోజున భక్తులు ఎంతో సంబరంగా పిడకల సమరం జరుపుకోవడం ఆనవాయితీ.
పది వేల మందికిపైగా.. : కారుమంచి నుంచి అశ్వం మీద కైరుప్పలకు వచ్చిన నాగభూషణ్ రెడ్డి.. స్వామివారికి టెంకాయ సమర్పించిన అనంతరం పిడకల సమరానికి భక్తులు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం కాళికాంబ దేవి, వీరభద్రస్వామి వారి ప్రేమకు చిహ్నంగా భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి… పిడకలతో కొట్టుకున్నారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన పిడకల సమరంలో భక్తులు కొందరు గాయపడ్డారు. వారు అంగారం (పసుపు) అంటించుకుని.. సంతృప్తి చెందారు.