1201 మంది హజ్ యాత్రికుల ఎంపిక :హజ్ కమిటీ చైర్మన్ గౌస్లాజం
1 min read– యాత్రికులకు రవాణా ఖర్చుల క్రింద తక్కువ ఆదాయం ఉన్న వారికి 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పల్లెవెలుగు వెబ్: రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.ఎండి.ఇంతియాజ్ ఈ సంవత్సరం 1201 మంది హజ్ యాత్రికులను రాష్ట్రం నుండి మక్కాకు పంపేందుకు ఆన్లైన్ ద్వారా డ్రా తీసి ఎంపిక చేశారు. సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మౌల్సీ, ముల్లా, హబ్ యాత్రకు వెళుతున్న యాత్రికులు, కర్నూలు ఎమెల్యే హఫీజ్ ఖాన్,ఎంఎల్సీ ఇశాక్ బాషా, హజ్ కమిటీ సభ్యుల సమక్షంలో డ్రా తీశారు. రాష్ట్రంలో ఈ సంత్సరం 1416 మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే కేంద్ర హజ్ కమిటీ 1201 మంది మాత్రమే రాష్ట్ర కోటా గా నిర్ణయించింది. కేంద్ర హజ్ కమిటీ నిబంధనల మేరకు సోమవారం డ్రా నిర్వహించారు. రాష్ట్రంలోని 1201 మందిని ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపిక చేశారు. యాత్రికులకు హజ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించేందుకు ఖాదిముల్ హుజ్జత్ లుగా ప్రభుత్వ అధికారులను ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో 36 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా కేవలం 6 మందిని మాత్రమే డ్రా తీసి ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 3లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి 60 వేల రూపాయలు, ఆ పై ఆదాయం ఉన్న వారికి 30 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా హజ్ కమిటీ చైర్మన్ డిఎస్.గౌస్ లాజం మాట్లాడుతూ ఎంపికైన హాజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 6వ తేదీ లోపు పాస్పోర్టును కార్యాలయానికి సమర్పించాలన్నారు. అలాగే 81 వేల రూపాయలు పే ఇన్ స్లిప్ లను కూడా ఇవ్వాలన్నారు. మెడికల్ ఫిటెనెస్తో పాటు ఇటీవల తీసుకున్న పాస్పోర్టు సైజ్: ఫోటోలను కూడా యాత్రికలు సమర్పించాలని ఆయన కోరారు. ఈ ప్రయాణికులు హైదరాబాదు లేదా బెంగుళూరు విమానాశ్రయాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరతారని ఆయన చెప్పారు. రాష్ట్ర మైనార్జీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎఎండ్ ఇంతియాజ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారితో హజ్ యాత్రకు అనుమతించని సౌదీ ప్రభుత్వం ఈ విడత రాష్ట్రంలోని 1201 మంది యాత్రికులను హజ్ యాత్రకు అనుమతించడం సంతోషకరం అన్నారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న 215 మంది యాత్రికులను కూడా కేంద్ర హజ్ కమిటీతో సంప్రదించి వారిని కూడా హజ్ యాత్రకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. మేరకు వెయిటింగ్ లో ఉన్న 215 మంది అభ్యర్థుల పేర్లను కూడా డ్రాతీసి పేర్లను ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా వారికి ఇచ్చిన కోటాలో యాత్రికులు రాకపోతే ఆ కోటాను రాష్ట్రం తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. విజయవాడ కేంద్రంగా జరగాల్సి ఉన్న లక్కీడ్రాను ఎక్కువ మందియాత్రికులు వెళుతున్న కర్నూలుకు మార్చామన్నారు. రాయలసీమలో మిగిలిన 7 జిల్లాలు కలిపి 657 మంది యాత్రికులు వెళుతున్నారని ఆయన చెప్పారు. హాజ్ వెళ్లే యాత్రికులు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగ్గా జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తూ హజ్ పవిత్ర స్థలంలో ప్రార్ధనలు చేయాలని ఆయన కోరారు. హజ్ యాత్రికులు తమకు కలిగే అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు మొయిల్ ఐడి [email protected], టోల్ ఫ్రీ నెంబర్లు 1800-425787, 0866-2471786 సంప్రదించాలని కోరారు. అలాగే ఎంపిక అయిన హజ్ యాత్రికులు తమ పేర్లను నిర్ధారించుకొనేందుకు మెయిల్ ajcommittee.gov.inhttpps://apstatehajcommittee.com website లను చూడవచ్చన్నారు. ఈ సమావేశంలో హజ్ కమిటీ సభ్యులు అతావుల్లా, మంజూరు అహ్మద్, ఉర్దూ అకాడమీ సభ్యులు సైయ్యద్ నూరుల్లా, అబ్దుల్ షుకూర్ హజ్ కమిటీ సిఇఓ ఖాధర్ బాషా, జిల్లా, మైనార్టీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.