పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్.. పలువురి అరెస్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించారంటూ పలువురి పై కేసులు నమోదయ్యాయి. కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 25 మంది టీచర్లు, ఒక అటెండర్, కర్నూలు జిల్లాలో ఐదుగురు యువకులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు జెడ్పీ పాఠశాలలో లెక్కల టీచరుగా పనిచేస్తున్న బి.రత్నకుమార్ వాట్సప్ నంబరు నుంచి కృష్ణాజిల్లా పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసే టీచర్లకు ప్రశ్నపత్రం, జవాబు పత్రాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జవాబులతో కూడిన కాపీలను పసుమర్రు పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న డోకిపర్రు ఉన్నత పాఠశాలకు తీసుకువెళ్తున్నట్టు వెల్లడైంది. కర్నూలు జిల్లాలో టెన్త్ గణిత ప్రశ్నపత్రం లీకైన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజులు తెలిపారు. ఆలూరు మండలం మరకట్టు గ్రామానికి చెందిన కృష్ణతో పాటు కురవళ్లి, ఆలూరు ప్రాంతాలకు చెందిన వెంకటేశ్, ఉమ, అజిత్, నాగేశ్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.