భారతీయ కిసాన్ యూనియన్ లో చీలిక !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటంలో భారతీయ కిసాన్ యూనియన్ కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్షపార్టీలతో సన్నిహితంగా మెలిగింది. ఈ పరిణామం బీకేయూ చీలికకు అంకురార్పణ చేసింది. బీకేయూలో కీలక నేతలుగా ఉన్న తికాయత్ సోదరులు రాకేశ్, నరేశ్ తీరును వ్యతిరేకిస్తూ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేశ్ సింగ్ చౌహాన్ వేరు కుంపటి పెడుతున్నట్లు ప్రకటించారు. బీకేయూలో తికాయత్ సోదరులు ఉంటారని, తమది ఇక కొత్త సంస్థ అని, భారతీయ కిసాన్ యూనియన్ (ఎ-అపొలిటికల్) పేరుతో అది కార్యకలాపాలు సాగిస్తుందని ప్రకటించారు. అపొలిటికల్ అంటే రాజకీయాలతో సంబంధం లేనిది అని అర్థం. ‘బీకేయూ-ఎ’కు రాజేశ్ సింగ్ చౌహాన్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. రైతు సంఘమైన బీకేయూ ఏ రాజకీయ పార్టీ కోసం పని చేయరాదనేది సిద్ధాంతం అని, అయితే రాకేశ్ తికాయత్ ‘రాజకీయ క్షేత్రం’లోకి మారిపోయారని, రైతుల సమస్యలపై దృష్టిపెట్టడం లేదని.. ఫలితంగానే వేరుగా సంఘం పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.