సమానత్వానికి ప్రతీక ‘రంజాన్’
1 min readపల్లె వెలుగు వెబ్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక మందిరాలు అలరారుతున్నాయి. పవిత్ర రంజాన్ ప్రారంభంతో మసీదు పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ అలుముకుంది. సమానత్వానికి ప్రతీక అయిన ఉపవాసాలుప్రారంభమయ్యాయి. శుభాల సమూహమైన రంజాన్ మాసం ప్రారంభంతో ముస్లిం ప్రాంతాలలో ఆధ్యాత్మిక సందడి ప్రారంభమైంది.
ఇస్లాంకు సంబంధించిన 12 మాసాల్లో రంజాన్ తొమ్మిదో మాసం. దివ్య గ్రంథమైన ఖుర్ ఆన్ ను ఈ మాసంలోనే అల్లాహ్ అవతరింపజేశాడని ముస్లింల నమ్మకం. షాబాన్ మాసంలో అమావాస్య తర్వాత నెల వంక కనిపించిన తర్వాత వేకువ జామున ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు ఉన్నతమైన ధార్మిక చింతనతో దాన ధర్మాలు.. పుణ్య కార్యాలను ఆచరిస్తారు ముస్లింలు. రోజా ఉండే వారు ఉదయాన్నే మేల్కొవాలి. ఉదయం 4, 5 గంటల మధ్య అన్నపానీయాలు పూర్తీ చేయాలి. దీన్నే సహ్ రీ అంటారు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు పచ్చి మంచి నీళ్లు కూడ తీసుకోరాదు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు.ఈ మాసమంతా ఐదు పూటల నమాజ్ తో పాటు అదనంగా తరావీ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి.
పేద, ధనిక తేడా లేదు..: రంజాన్ సందర్భంగా ముస్లింలంతా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ధనిక పేద తేడా లేకుండా ఆకలి దప్పులతో అందరూ ఒకే పంక్తిలో నిలబడతారు. ఒకే సారి ఉపవాస దీక్ష విరమిస్తారు. దీని వల్ల సర్వమానవ సమాన భావన పెంపొందించబడుతుంది. అందరు సమానంగా ఆకలిదప్పులతో దీక్షను ఆచరించడం వల్ల ఎదుటి వారి ఆకలిని..భాధను సహ అనుభూతి పొందుతారు. ఫలితంగా ఎదుటి మనిషికి సహాయం చేసే ఉన్నతమైన గుణం అబ్బుతుంది. చెడు ఆలోచనల సమాహారాన్ని ఎలా ధ్వంసం చేయాలో రంజాన్ నేర్పుతుంది. మానవ సమాజ గమనానికి ఉన్నతమైన విలువలతో రంజాన్ మార్గదర్శనం చేస్తుంది.
ప్రారంభమైన సందడి: రంజాన్ ప్రారంభంతో మార్కెట్ లో సందడి ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా చార్మినార్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. సుర్మా, అత్తరు, తజ్ వీ, టోపీలతో పాటు సహ్ రీ, ఇఫ్తార్ సామాగ్రి కొనుగోలుకు ప్రజలు బారులు తీరుతున్నారు. చార్మినార్ గాజులకు ప్రత్యేకం కావడంతో.. ఆ ప్రాంతమంతా మరింత సందడి నెలకొంది. నగరంలో చాలా ప్రాంతాల్లో హలీం బట్టీలు కూడ సిద్ధమయ్యాయి. ఉపవాస దీక్ష సందర్భంగా ముస్లింలు కొనుగోలుచేసే కర్జూరం.. పండ్లతో మార్కెట్లు కళకలలాడుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసం మనిషిలో మరింత ఉన్నతమైన భావనను పెంపొందించాలి. రంజాన్ స్పూర్తితో సర్వమానవ సమానత్వానికి.. లోక వికాసానికి మానవ సమాజం పాటుపడాలి. చెడును ధ్వంసం చేస్తు.. సమాజంలో మంచిని వెదజల్లాలి. అప్పుడే పవిత్ర రంజాన్ లక్ష్యం నెరవేరుతుంది.