ఐటీ కొలువు వదిలి.. గాడిదల పెంపకం చేపట్టి !
1 min readపల్లెవెలుగువెబ్ : గాడిదల పెంపకాన్ని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టిన ఘటన సంచలనం రేపింది. కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారమ్‌ను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలిన శ్రీనివాసగౌడ్ రూ.42లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో ఫారమ్ పెట్టారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెట్టిన గాడిదల పెంపకం, శిక్షణాకేంద్రం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. తాను 2020వ సంవత్సరం వరకు సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేశానని, దాన్ని వదిలేసి గాడిదలు కాస్తున్నానని శ్రీనివాసగౌడ్ చెప్పారు. ‘‘గాడిద పాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి, అందుకే గాడిద పాలు అందరికీ అందుబాటులో ఉంచాలనేది నా కల. ఈ పాలు ఔషధ ఫార్మలా’’ అని గౌడ్ వివరించారు. గాడిద జాతుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో తాను గాడిదల పెంపకం ఫాం పెట్టినట్లు యజమాని శ్రీనివాసగౌడ్ చెప్పారు. గాడిద ఫారమ్ గురించి మొదట్లో ప్రజలు నమ్మలేదని ఆయన పేర్కొన్నారు.