అగ్నిపథ్ ఆందోళనలు.. కాల్పుల్లో ఒకరి మృతి
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రైళ్లను తగులబెట్టడంతో పరిస్థితి చేయి దాటింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పూర్తిగా ధ్వంసం చేయడంతో రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఛాతీలో బుల్లెట్ దిగడంతో యువకుడిని హుటాహుటిన పోలీసులు గాంధీకి తరలించారు. కాగా.. ఆ యువకుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఆందోళనలో గాయపడిన 11 మంది యువకులను సైతం గాంధీకి తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతోంది. ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరిగింది. అతనికి బ్లడ్ ఎక్కించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.