పెట్రోల్ బంకులూ.. ఇక `నో స్టాక్` బోర్డ్ చెల్లదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రైవేటు కంపెనీల పెట్రోల్ బంకులకూ కేంద్రప్రభుత్వం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (యూఎస్ఓ) నిబంధనలు వర్తింపచేసింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రైవేట్ పెట్రోల్ బంకులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటివరకు యూఎస్ఓ నిబంధన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మాతమ్రే వర్తించేది. ఈ నిబంధన కింద ఓఎంసీలు లాభనష్టాలతో నిమిత్తం లేకుండా రోజూ పెట్రోల్, డీజిల్‌ను వాహనదారులకు అందుబాటులో ఉంచాలి. లేకపోతే ఆ బంకుల లైసెన్సు రద్దవుతుంది. ఇప్పటివరకు ప్రైవేటు కంపెనీల నిర్వహణలోని బంకులకు ఈ నిబంధన లేదు. దీంతో ఈ కంపెనీలు ముడి చమురు ధర పెరిగి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గిట్టుబాటు కానప్పుడు నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ చమురు ధర 120 డాలర్లకు చేరింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఏప్రిల్ 6 నుంచి ధరలు పెంచకుండా నష్టంతో పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఇంత నష్టంతో బంకులను నడపలేక మూసివేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే నెపంతో ప్రైవేటు పెట్రోల్ బంకులకు నిబంధనలు వర్తింప చేయాలని నిర్ణయించింది.