అగ్నిపథ్ తో యువత బలహీనమవుతోంది !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రప్రభుత్వం అగ్నిపథ్తో సాయుధ దళాలను బలహీనపరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈడీ విచారణ అనేది ముఖ్యమైన విషయం కాదని, యువత ఉద్యోగాలకు సంబంధించినదే అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. ‘‘యువతకు ఉద్యోగాలు కల్పించలేని ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు ఈ దేశాన్ని ప్రధాని మోదీ అప్పగించేశారు. చివరికి సాయుధ దళాల్లో చేరే అవకాశాన్ని కూడా యువతకు మూసేశారు. ఇప్పుడు సాయుధ దళాల్లో పనిచేసిన తర్వాత ఉద్యోగం రాదని గ్యారెంటీగా చెప్పగలను. చైనా సైన్యం మన భూభాగాన్ని వెయ్యి చదరపు కిలోమీటర్లకుపైగా ఆక్రమించింది. మన సైన్యాన్ని బలోపేతం చేయాల్సి ఉండగా ప్రభుత్వం దాన్ని బలహీనం చేస్తోంది. దీని ఫలితం యుద్ధం వచ్చినప్పుడు తప్పక కనిపిస్తుంది. సాగు చట్టాలను మోదీ వెనక్కి తీసుకుంటారని అప్పుడు చెప్పాను. అగ్నిపథ్నూ మోదీ వెనక్కి తీసుకుంటారని ఇప్పుడు చెబుతున్నా. అదే జరుగుతుంది. దేశానికీ, సైన్యానికీ ప్రభుత్వం చేస్తున్న ఈ ‘కొత్త ద్రోహాన్ని’ రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడుతుంది’’ అన్నారు.