మరింత బాధ్యతగా పని చేయండి: మంత్రి బుగ్గన
1 min read974 మంది మహిళా పోలీసులకు ప్రొహిబిషన్ డిక్లరేషన్ ఆర్డర్స్ అందజేత
కోటిన్నర మంది దిశాయాప్ డౌన్లోడ్ చేయడం అభినందనీయం..
వ్యవస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకురండి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
పల్లెవెలుగు వెబ్: గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేసే మహిళా పోలీసులు మరింత బాధ్యతగా పని చేయాలన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శుక్రవారం కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని గ్రామ,వార్డు సచివాలయంలో పని చేసే 974 ( కర్నూలు 524, నంద్యాల450) మహిళా పోలీసులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు కర్నూలు ఎమ్మేల్యే హాఫిజ్ ఖాన్ గారు, కర్నూల్ రేంజ్ డీఐజీ శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ మహిళలకు రక్షణగా, ప్రజలకు సేవలందించడంలో మరింత బాధ్యతతో పని చేయాలన్నారు. అప్పట్లో జాతిపిత మహాత్మగాందీ స్ధానిక సంస్థల ద్వారా గ్రామ, పట్టణ పరిపాలనను పటిష్ట పరచడానికి పూనుకున్నారన్నారు. గ్రామ, పట్టణాలను అభివృద్ది పరచడానికి 73, 74 రాజ్యాంగ సవరణలు కూడా చేశారన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. బేతంచేర్లలో సర్పంచ్ గా పని చేసినప్పుడు తాను కూడా ప్రజల సమస్యలను దగ్గరుండి చూశానన్నారు. ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఎంతో ప్రజలకు మేలు చేస్తున్నారన్నారు.
పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
ప్రజలు, మహిళలు కొన్ని చెప్పుకోలేని సమస్యలను స్నేహితురాళ్ళుగా, అక్క చెల్లెలుగా గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ( మహిళా పోలీసులకు) చెప్పుకుంటారన్నారు. మంచి స్ఫూర్తి తో పని చేయాలన్నారు. వ్యవస్ధకు మంచి పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా బాగా పని చేయాలన్నారు.
దిశా యాప్‌పై అవగాహన పెంచండి : కర్నూల్ రేంజ్ డీఐజీ శ్రీ ఎస్ సెంథిల్ కుమార్
దిశా యాప్ పై ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పించడానికి ఇంకా బాగా కృషి చేయాలన్నారు. మహిళల పై నేరాలు జరగకుండా చూడాలన్నారు. ఇప్పటివరకు 1 కోటి 50 లక్షల మంది దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. గ్రామ, పట్టణాల్లో అసాంఘిక కార్యకలపాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని పై అధికారులకు తెలియజేయాలన్నారు.
ప్రజాసేవను.. ఛాలెంజ్‌గా తీసుకోవాలి: జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్
మహిళా పోలీసులు ప్రజలకు సేవలందించడాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకోని పని చేయాలన్నారు. ప్రజలకు ఎక్కువగా దగ్గరుండి పని చేసే అవకాశం మీకే ఉందన్నారు. 974 మంది మహిళా పోలీసులకు ప్రోబేషన్ డిక్లరేషన్ కాపీలను అందజేశామన్నారు. మన రాష్ట్ర సచివాలయ వ్యవస్ధ మన దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రసాద్, డిఎస్పీలు కెవి మహేష్, ఇలియాజ్ భాషా, డిపిఓ ఏవో సురేష్ బాబు, సిఐలు, ఆర్ ఐలు, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.