`మద్యం` మళ్లీ ప్రైవేటుకే.. ప్రభుత్వం ఏం చెబుతోంది ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో ప్రస్తుతం వైన్ షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేసి.. వాటన్నింటినీ ఎక్సైజ్ శాఖే నడిపిస్తోంది. తాజాగా మద్యంపై ఆదాయాన్ని పెంచుకునేందుకు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగిస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాలు పెంచడంతో పాటు లైసెన్సు ఫీజు రూపంలో వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై ఏపీ ఎక్సైజ్ శాఖ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉందని.. మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది.