పవన్ అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపిస్తామంటున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఈసారి బరిలోకి దిగుతారని పార్టీలోని ఒక వర్గం చెబుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 25వేల ఓట్లకు తక్కువ కాకుండా జనసేన సాధించింది. తెలుగుదేశం గత ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక కారణం. జనసైనికులు ఇంటర్నల్ గా చేయించుకుంటున్ సర్వేలో పవన్ గత ఎన్నికల్లోనే ఇక్కడి నుంచి పోటీచేసి ఉండాల్సిందని, గెలిపించుకునేవారిమని చెప్పినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి భారీగా 28 వేల ఓట్లు సాధించారు. 151 సీట్లు సాధించిన జగన్మోహన్రెడ్డి హవాలో కూడా ఆమె అన్ని ఓట్లు సాధించడం అద్భుతంగా పరిగణించారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పడు పిఠాపురంలో జనసేన మరింత బలం పుంజుకుంది అంటున్నారు. వార్డు వార్డుకు, గ్రామ గ్రామానికి కార్యకర్తల యంత్రాంగం ఉందని.. యువత ఆయనవైపే ఉంటారు కాబట్టి విజయానికి ఢోకా లేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడి ఎంపీటీసీ స్థానాన్ని ఆ పార్టీనే కైవసం చేసుకుంది. అందుకే పవన్ ఇక్కడ నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.