రైతులకు సబ్సీడీ పై డ్రోన్ల పంపిణీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి మరింత ఆధునికత జోడించడంతో పాటు రైతులకు మరింత సులభమయ్యే పద్ధతులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం డ్రోన్ల సాగును అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలానికి మూడు చొప్పున డ్రోన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. డ్రోన్ల వల్ల పురుగు మందుల పిచికారీ పనులు మరింత సులభతరం కానున్నాయి. ఐదుగురు చేసేపనిని ఒక్కడ్రోన్ పూర్తి చేస్తోంది. దీని వల్ల నీళ్లు, పురుగు మందుల ఖర్చు, సమయాన్ని తగ్గించే అవకాశముంది. అలాగే పొలంలోని మొక్కలన్నింటికీ సమానంగా మందు పిచికారీ చేసే అవకాశముంటుంది. ముఖ్యంగా మామిడి, చీని, కొబ్బరి, బొప్పాయి, దానిమ్మ, అరటి వంటి ఉద్యాన పంటలకు మందులు పిచికారీ చేయడం మరింత సులభతరం కానుంది.