PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మపాలు అమృతం: డా. కుసుమ‌

1 min read

– ఆగ‌స్టు 1 నుండి  వ‌ర‌కు అంత‌ర్జాతీయ త‌ల్లిపాల వారోత్సవాలు

పల్లెవెలుగు వెబ్​: త‌ల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివి. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే ఔష‌దం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా అవ‌గాహ‌న పెంచ‌డానికి ప్రతి సంవ‌త్సరం ఆగ‌స్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వర‌కు అంత‌ర్జాతీయ త‌ల్లిపాల అవ‌గాహ‌న వారోత్సవాలు నిర్వహిస్తారు. తల్లి పాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ లాభాలున్నాయి. ఎన్నోరకాల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.? రోజుకు ఎన్నిసార్లు పట్టాలి.? ఎలా పట్టాలి.? తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమి తినాలి.? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి.? ఇలా చాలా అంశాలపై అందరికి అవగాహన ఉండదు. ఆధునిక కాలం అమ్మలకు మరింత తక్కువ.

బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎటువంటి క్రీములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8–10 సార్లు లేదా ప్ర‌తి రెండు నుండి మూడు గంట‌ల‌కు ఒక‌సారి త‌ల్లిపాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీంతో  ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.

పాలిచ్చే సమయంలో ఇవి తీసుకోకూడదు..

– బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు.

–  పాలిచ్చే సమయంలో కెఫిన్‌ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

ముర్రుపాలు తప్పనిసరి

* బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు.

* ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్‌ ‘ఏ’ ఉంటుంది.

* వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి.

* శిశువు ప్రేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడుతాయి.

* తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే.

* బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె ప‌ట్టిచడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్‌ నీళ్లు ఇవ్వడం చేయకూడదు.

తల్లిపాలు పుష్కలంగా రావాలంటే…

* గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.

* ఆహారంలో తీపి పదార్థాలు (స్వీటు కాకుండా) అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు తినాలి.

తల్లికి కలిగే లాభాలు..

* తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.

* చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు.

* బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు.

* తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియోపొరొసిస్‌ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది.

* తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.

* ఆరు నెలల వరకు  రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.

* తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు.

తల్లిపాలతో కలిగే లాభాలు

* తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.

* నాణ్యమైన ప్రోటీన్లు, ఒమెగా 3, ఒమెగా6 అలాగే ఒమెగా9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి.

* ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

* ఇందులోని లాక్టోజ్‌తో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.

* తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారినుంచి కాపాడుతాయి.

* తల్లిపాలతో బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

* ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్‌ వంటి వ్యాధులు రావు.

* బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.

About Author