ఆ ఆపరేషన్లు అంటే.. కిలో మీటర్ పారిపోతున్న పురుషులు !
1 min readపల్లెవెలుగువెబ్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికైతే కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు.