6వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఎస్సీ మాదిగ ఉపకులాల ఏ బి సి డి వర్గీకరణ చట్టబద్ధత కోసం కొనసాగుతున్న నిరసన దీక్షలు సోమవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు మాదిగ సమాజమంతా ఒక్కతాటిపై కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన బిజెపి 8 నెలల లోపు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన వాగ్దానం నిలబెట్టుకోవాలి అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ప్రక్రియలో మాదిగ ఉపకులాలు ఎలాంటి ప్రయోజనాలను పొంద లేదన్నారు. విద్యా, ఉద్యోగాల్లోనూ, రాజకీయ పదవులను పొందడం లోనూ ఎస్సీ రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు ప్రయోజనం చేకూర్చ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత తేవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్థానిక రామాలయ కమిటీ చైర్మన్ శివ శంకర్ నాయుడు, ఉప్పర బాలప్ప ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పెద్దయ్య రంగస్వామి ఓంకారం దీక్షా శిబిరాన్ని సందర్శించి నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. ఈ నిరసన దీక్షలలో ఎమ్మార్పీఎస్ నాయకులు రవికుమార్ రాముడు రామాంజనేయులు ఈశ్వరప్ప రంగడు తదితరులు పాల్గొన్నారు.