అల్పపీడనం బలపడింది.. ఏపీకి భారీ వర్షం !
1 min readపల్లెవెలుగువెబ్ : వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. 48 గంటల్లో బలపడి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్ నుంచి అల్పపీడనం ప్రాంతం మధ్యగా పయనిస్తూ అండమాన్ వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.