రైతు కష్టం నేలపాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆరుగాలం కష్టపడ్డ రైతు శ్రమ నేలపాలైంది. కొండంత ఆశతో ఎదురు చూసిన పంట నిరాశ మిగిల్చింది. అహరహం శ్రమించి పండించిన పంట చేతులారా పారబోశాడు. చివరికి రైతుకు కన్నీరే మిగిలింది. కుడిఎడమల రైతు దగా అయ్యాడు. వ్యవసాయం అంటే జూదంలా మారిపోయింది. గిట్టుబాటు లేక అప్పుల కుప్ప నెత్తిన పడుతోంది. అనంతపురం జిల్లా టామాటా సాగుకు ప్రసిద్ధి. మదనపల్లి తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ అనంతపురం. వందలాది ఎకరాల్లో టమోటా సాగవుతోంది. ఈ ఏడాది మంచి ధర వస్తుందన్న నమ్మకంతో రైతులు టమోటా సాగు చేశారు. కానీ పెద్ద ఎత్తున టమోటా దిగుబడి రావడం, భారీ వర్షాలతో టమోటా రైతు నిండామునిగిపోయాడు. మార్కెట్ కు టమోటా తీసుకెళ్తే నో సేల్
బోర్డు పెడుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ , కూలీ ఖర్చులు కూడ రైతుకు దక్కడం లేదు. శుక్రవారం అనంతపురం మార్కెట్ కు తీసుకెళ్లిన కర్తనపర్తి రైతులకు నిరాశ మిగిలింది. వందలాది టమోటా బాక్సులు నో సేల్ పడ్డాయి. దీంతో రైతులు అక్కడే రోడ్డు వైపున టమోటా పారబోశారు. టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కర్తనపర్తి రైతు గాలి కిషోర్ డిమాండ్ చేశారు. జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. హామీలు ఆచరణ రూపంలోకి రావాలని కోరారు.