ఆ వ్యాధి బాధితులకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : అరుదైన వ్యాధులతో బాధపడుతూ ఆర్థిక సాయం కోరేవారి నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించడానికి.. నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలోని ఎనిమిది ప్రముఖ ఆస్పత్రులను కోరింది. వాటిలో ఒకటి హైదరాబాద్ ఉప్పల్‌లోని ‘సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్’. ఈ సంస్థ.. అరుదైన వ్యాధులకు సంబంధించి నిమ్స్ తో కలిసి పనిచేస్తుంది. అరుదైన వ్యాధులంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ప్రతి 1000 మందిలో ఒకరికంటే తక్కువ మందికి వచ్చేవి. ఇలాంటివాటిలో ఎక్కువ భాగం జన్యువ్యాధులే. తలసీమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్ ఎనీమియా, స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వంటివి ఇందుకు ఉదాహరణలు. అలాంటివాటి బారిన పడిన బాధితుల నుంచి వచ్చే దరఖాస్తులను నెలరోజుల్లోగా పరిశీలించి, ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకోవడమే ఈ కమిటీల పని. కమిటీలో నిపుణులు పచ్చజెండా ఊపితే బాధితులకు ప్రభుత్వం రూ.50 లక్షల దాకా ఆర్థిక సాయం చేస్తుంది.