ఉద్యోగులకు..రోల్‌మోడల్
1 min read– భవిష్యత్‌లోనూ ప్రజలకు సేవలు అందించాలి
– జేసీ–3 సయ్యద్‌ఖాజా మొహిద్దీన్ పదవీ విరమణ సభలో కలెక్టర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: వృత్తినే దైవంగా భావించి… విధులను సక్రమంగా… విజయవంతంగా నిర్వర్తించిన జేసీ–3 సయ్యద్ ఖాజా మొహిద్దీన్… ఉద్యోగులకు రోల్‌మోడల్‌గా నిలిచారని కలెక్టర్ జి. వీరపాండియన్ కొనియాడారు. కరోనా మొదటి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్‌గా కీలకబాధ్యతలు నిర్వర్తించిన సయ్యద్ ఖాజా మొహిద్దీన్… పదవీ విరమణ అనంతరం ప్రజలకు, యువతరానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జేసీ–3( ఆసరా మరియు సంక్షేమం) గా విధులు నిర్వర్తిస్తున్న సయ్యద్ ఖాజా మొహిద్దీన్ పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) ఎస్.రామ సుందర్ రెడ్డి, నూతన జేసీ–3గా బాధ్యతలు స్వీకరించిన ఎంకేవీ శ్రీనివాసులు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ ఓ పుల్లయ్య, కర్నూలు ఆర్ డి ఓ హరిప్రసాద్, బిసి కార్పొరేషన్ ఈడి శిరీష, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహబూబ్ భాష, సిరికల్చర్ ఎడి వాణి, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ సుబ్రమణ్యం, తహసిల్దార్ అంజన్ బాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
శేష జీవితంలోనూ.. సేవ చేయాలి: కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఉద్యోగం మన జీవితంలో ఒక భాగమని, పదవీ విరమణ అనంతరం సామాజిక సేవలు చేయాలన్నారు. డిప్యూటీ తాసిల్దార్, తహసిల్దార్, ఆర్డిఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హోం శాఖ, కేంద్ర సమాచార శాఖ, పలు శాఖల్లో 37 ఇయర్స్ మంచి సేవలందించి అందరి మన్ననలు పొందారన్నారు.
అనుభవం.. వృథా కారాదు..: జేసీ–2 రాం సుందర్ రెడ్డి
అనంతరం జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) ఎస్.రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ చాలా సంవత్సరాలు తన సొంత కర్నూలు జిల్లాలో విశేష సేవలు అందించారన్నారు. ఎన్నికల సమయంలో అందరికంటే ముందే వచ్చి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి విశేష కృషి చేశారన్నారు. పాత ఆర్ ఓ ఆర్, కొత్త ఆర్ ఓ ఆర్, ల్యాండ్ సీలింగ్, మేజర్ యాక్ట తదితర రెవిన్యూ చట్టాలన్నీ చూసి ఉంటారని ఆ అనుభవాలను ఒక బుక్కు గా తీసుకురావాలని వారు కోరారు. సమాజానికి నవతరానికి… మంచి సేవలు అందించాలని వారు కోరారు.
శేషజీవితంలోనూ.. సేవ చేస్తా : జేసీ–3 సయ్యద్ ఖాజా మొహిద్దీన్
సొంత జిల్లాలో జేసీ–3గా సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇక్కడే రిటైర్డు కావడం కూడా ఆనందంగా ఉందన్నారరు. 37 ఏళ్ల సర్వీసులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని పేర్కొన్న జేసీ–3.. గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు, గ్రామ, పంచాయతీ, మున్సిపల్, జెడ్పి ఎన్నికలు, కరోనా కట్టడి, తుంగభద్ర పుష్కరాలు విజయవంతంలో అందరితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. చదువు మానేసిన విద్యార్థుల స్థితిగతులపై అధ్యయనం చేసి.. వారు ఉన్నత చదువులు చదివి ఉన్నతస్థానంలో అధిరోహించేలా కృషి చేస్తానన్నారు. పదవి విరమణ మహోత్సవం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ దంపతులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.