జగన్ కంచుకోట పై చంద్రబాబు గురి !
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా కంచుకోట లాంటిది. ఈ జిల్లాపై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిసారించారు. ఈనెల 14వ తేదీన నెల్లూరులో మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. తర్వాత మరో రెండురోజులు ఆయన ఇక్కడే మకాం వేయనున్నారు. 15వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 16వ తేదీన నెల్లూరు నుంచి గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట మీదగా రోడ్ షో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని భావిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా మారింది. వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లోను ఇక్కడ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించి ఆ పార్టీ కంచుకోటగా జిల్లాను మార్చారు. రానున్న ఎన్నికల్లో ఈ కంచుకోటను బద్దలు కొట్టాలని బాబు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టగా, అందుకు విరుగుడుగా చంద్రబాబు వైసీపీకి బలంగా ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టారు. రెండు పార్టీల అధినేతలు ఢీ అంటే ఢీ అంటున్న వాతావరణంలో చేయబోతున్న రోడ్ షోపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ధాటికి ఇక్కడి టీడీపీ నేతలు నెమ్మదించారు. వారిలో చైతన్యం నింపి క్యాడర్ లో జోష్ తీసుకురావడానికి బాబు ప్రయత్నిస్తున్నారు.